Friday, October 14, 2011

ఇది అప్రకటిత రాష్ర్టపతి పాలన

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలుగు మాట్లాడటం సరిగా రాదని ఎద్దేవా చేస్తూ ఉంటారు. భాష ఉద్దేశం ఎదుటి వారికి అర్థం కావటానికేగా! ఆ విధంగా చూస్తే కిరణ్ తెలుగు బాగానే అర్థం అవుతుంది. కిరణ్ యాస తన సొంత యాసే గానీ, అది చిత్తూరుది కాదు, రాయలసీమది అంతకంటే కాదు. కిరణ్‌కు తెనుగు నుడికారం తెలిసినట్లుంది, లేకపోతే చరిత్ర తిరగరాస్తానని, సీఎం కావటానికి నుదుట రాసి ఉండాలన్న నుడికారం ఆయనగారి నోట దొర్లి ఉండేది కాదు. సీఎం, పీఎం కావటానికి మన రాజ్యాంగం ఎటువంటి విద్యార్హతలు నిర్దేశించలేదు. ఆ మాటకొస్తే భారతదేశాన్ని సుమారు అర్ధ శతాబ్దం పాలించిన అక్బర్ చక్రవర్తికి చదువురాదు. అయినా, జనరంజక పాలన అందించి ‘గ్రేట్’ అనిపించుకున్నాడు. అయితే మన కిరణ్‌కు తెలిసింది కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లో మెలిగి తన పదవిని కాపాడుకోవటమే. ఆయనగారి నుదుట రాసింది ఈ యోగ్యతే! వైఎస్ పేరు తుడిచేయాలన్న దుగ్ధ విశాఖ గర్జన సభకు ఫార్ములా సమీకరణతో కుర్చీలు నిండిన జనాన్ని చూసి కిరణ్‌కు ధైర్యం వచ్చినట్లుంది. పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానివే కానీ, వైఎస్‌వి కాదన్నాడు. చరిత్ర తిరగరాయడగమంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయడమే కాబోలు! అంటే వైఎస్ పథకాలకు గ్రహణం పట్టించడమన్న మాట! కిరణ్ కిలో రూపాయి బియ్యం పథకమే చూడండి! వైఎస్ రెండు రూపాయలంటే తాను రూపాయికే ఇస్తున్నానని, వైఎస్ కంటే తానే ఘనుడనని నిరూపించుకోవడానికి పడిన తంటా ఇది. అయితే ఇందులోని చిదంబర రహస్యం ఏమంటే, వైఎస్ మరణించి రెండేళ్లయినా, వైఎస్ ఇస్తామన్న 30 కేజీల పథకాన్ని అటకెక్కించిన సంగతి మభ్యపెట్టి కిలో బియ్యం రూపాయితో సులభంగా కీర్తి సాధించే కిటుకు ఇందులో ఇమిడి ఉంది. 20 కేజీల కయ్యేది రూ.20 లే గానీ, మిగిలిన పది కేజీలు పేదలు మార్కెట్లో కొంటే కనీసం మరో రూ.200లు అవుతుంది. వెరసి 30 కేజీలకు రూ.220లు అవుతుంది. వైఎస్ పథకమైతే 30 కేజీలకు రూ.60లు అవుతుంది. అంటే కిరణ్ ప్రకారం అధికంగా రూ.160లు అవుతుంది. ఇదే కిరణ్ గారడీ! కిరణ్ కుమార్ జమానాలో రైతులకు మద్దతు ధర లభించక వరి వేసుకోవడానికి బదులు ఉరి వేసుకోవటమే మేలని రైతన్నలు పంట విరామం ప్రకటించుకొని లక్షల ఎకరాలు బీడు పెట్టుకున్నారు. మొలకెత్తని కంపెనీ విత్తనాలతో, మొలకెత్తినా కాపుకాయని విత్తనాలతో, రైతన్నలు తలలు పట్టుకొంటున్నారు. సినిమా టికెట్లు బ్లాకులో కొన్నట్లు, రసాయనిక ఎరువులు బ్లాకులో కొనవలసిన దుర్గతి ఏర్పడింది. చరిత్ర తిరగరాయడమంటే ఇదే కాబోలు! కిరణ్ కుమార్ సభలో మహిళలు పావలా వడ్డీ రుణాలు అందడం లేదని చేతులు అడ్డంగా ఊపితే కిరణ్‌కు చెమటలు పట్టాయి. వైఎస్ హయాంలో పెన్షన్లు, శాచురేషన్ కార్డులు అర్హులైన వారందరికీ రేషన్ పద్ధతిలో అందితే, కిరణ్ హయాంలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు కలలోని మాటగా తయార య్యాయి. ఇక ఆరోగ్యశ్రీ కొన ఊపిరితో ఉంది. విద్యుత్ కొరతతో పంపుసెట్లు ఆడక, 70 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి దాపురిం చింది. కిరణ్ అసమర్థతే దీనికి కారణం. దూరదృష్టి లోపించడం వల్ల జరుగుతున్న నష్టం ఇది. లక్షలాది రైతాంగాన్ని గోడాడిస్తున్నాడు. ఇది కిరణ్ జమానాలో జరుగుతున్న దారుణం. వైఎస్ పథకాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది జలయజ్ఞం. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి 86 ప్రాజెక్టులు నిర్మించి, కోటి ఎకరాలకు నీరిచ్చే బృహత్ పథకం ఇది. న భూతో న భవిష్యతి అని నిపుణులు కొనియాడిన పథకం. తన మొదటి ఐదేళ్ల హయాంలో యాభైవేల కోట్లు ఖర్చు చేసి వైఎస్ ఆ పథకాన్ని పరుగుబాట పట్టించాడు. దశాబ్దాలు శంకుస్థాపనలకే పరిమితమైన పోలవరం చేపట్టి నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. దశాబ్దాల పాటు ఊహల్లో విహరించిన ‘పులిచింతల’ను నేల బాట పట్టించి కృష్ణా, గుంటూరు జిల్లాల రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. రాయలసీమకు ప్రాణంతో సమానమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచి సీమ రైతులకు నూతనోత్తేజాన్ని కలిగించాడు. ప్రాజెక్టుల చరిత్ర తెలియని కిరణ్ కుమార్ జలయజ్ఞాన్ని మరచిపోయినట్లున్నారు. వైఎస్ మరణానంతరం ఈ రెండేళ్లలో జలయజ్ఞం ప్రాజెక్టులకు ఎంతెంత ఖర్చు చేశారో వివరమైన శ్వేతపత్రం ప్రకటించాలి. వైఎస్ పుణ్యాన తవ్విన కాల్వలు కిరణ్ పుణ్యాన పూడిపోకుండా ఉంటే అదే పదివేలు. కడప ఉపఎన్నికల ఫలితాలు చూశాక కాంగ్రెస్ నేతలు ఎన్నికలంటేనే బెదిరిపోతున్నారు. ఈ కారణం చేతనే ఇదిగో అదిగో అంటూ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్‌కు అలవాటుగా మారిన వాయిదాల సంస్కృతి మార్చడానికి రాజీవ్‌గాంధీ ప్రయత్నించినా ఫలితం లేదు. అదే విధంగా శాసనసభ్యుల రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికల్లో భంగపాటు తప్పదని వాటిని అంగీకరించకుండా నాన్చుతున్నారు. చరిత్ర తిరగరాస్తాననడంలో ఇంత బాగోతం ఉందని కిరణ్ జనానికి పాఠం నేర్పించాడు. గుర్నాథరెడ్డి సవాల్‌ను బొత్స స్వీకరిస్తాడా? నుదుట రాసినందువలన కిరణ్, బొత్సలకు పదవులు లభించలేదు. హైకమాండ్ మాట జవదాటకుండటమే వారి యోగ్యత. ఇద్దరి నోటబడి, తెలుగులోని జిగిబిగి నలిగి, నలిగి గజిబిజిగా మారుతూ ఉంటుంది. మిమిక్రీ కళాకారునికి వీరిద్దరి మాటలు విందు భోజనంతో సమానం. ఈ తమాషా అలా ఉంచితే తన అనంతపురం పర్యటనలో హెలికాప్టర్ నుండి తన మీద కురిపించిన పూల వర్షంతో ఉబ్బితబ్బిబ్బైన బొత్సకు స్థానిక ఎమ్మెల్యే గాలి తీసేశాడు. జగన్ వర్గీయులైన 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమో దింపచేయమని గురునాథరెడ్డి బొత్సకు సవాల్ విసిరాడు. కడప ఉప ఎన్నికల్లో పాల్గొని వచ్చిన బొత్సకు ఎన్నికలంటే తాచుపామును పట్టుకున్నంత భయం. బొత్స నోటి నుండి మరో వాక్త్న్రం వెలువడింది. అది ఏమిటంటే జగన్‌ది వారసత్వ రాజకీయమట! తన పేరు సీఎం పదవికి ప్రతిపాదించమని జగన్ ఎవరినైనా కోరాడా! నాడు సంతకం చేసిన వారిలో బొత్స కూడా ఉన్నాడు. నాటి ప్రత్యేక పరిస్థితులకు అయాచితంగా శాసనసభ్యులు స్పందించిన తీరు అది. బొత్స ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. 1984 అక్టోబర్ 31 పగలు ఇందిరా గాంధీ హత్య జరిగితే ఆ రాత్రే పశ్చిమ బెంగాల్‌లో ఉన్న రాజీవ్‌ను ఆగమేఘాల మీద పిలిపించుకొని కాంగ్రెస్ నాయకులు ఆయన్ను ప్రధానిని చేశారు. నవంబర్ 3న అంత్యక్రియలు జరిగేంతవరకు ఆగలేదు. రాజీవ్ గాంధీ కంటే సీనియర్లు కాంగ్రెస్‌లో లేకపోయారా? ఇది వారసత్వ రాజకీయం కాదా! నెహ్రూ వారసురాలిగా లాల్ బహదూర్‌శాస్త్రి మరణానంతరం ఇందిరాగాంధీ ప్రధాని కాలేదా? బొత్స కాంగ్రెస్ చరిత్ర చదువుకుంటే మంచిది. గాజు మేడల్లో నివసించే వారు ప్రత్యర్థుల మీద రాళ్లు రువ్వడం మానుకోవాలి. ఇది అమానుషం! వైఎస్ మరణానంతరం వందలాది మంది గుండెలు ఆగి చనిపోతే, ఇది బూటకమని మొదట భావించి, తర్వాత ఒక ఏడాదికి గానీ ఏఐసీసీ విచారించి నిజమని తేల్చింది. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల వంతున ఉపశమన విరాళం ఇస్తామని ప్రకటించి కూడా మరో ఏడాది దాటింది. ఇంత వరకు అతీగతీ లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నెత్తికెత్తుకున్న బొత్సలాంటి కాంగ్రెస్ నేతల తీరు ఇది. ఇది అమానుషమైన నిర్లక్ష్యం. మహానేతగా పొగిడిన వైఎస్ పట్ల కాంగ్రెస్ నేతల నిర్వాకం ఇది. సంక్షోభం ఇలా కొనసాగవలసిందేనా! విలీనం, గర్జనలు కాంగ్రెస్‌ను కాపాడలేవు. ఒకనాడు ఎర్రం నాయుడుగారు ఉత్తరాంధ్రలో తిరుగులేని నేత. ఇప్పుడేమయ్యాడు! బొత్స కూడా అంతే. పదవుల ఎరచూపి, పీఆర్‌పీని సోనియాగాంధీ బుట్టలో వేసుకున్నారు. కానీ, పదవులు ఎండమావిగా మిగిలిపోయాయి. ఎన్నికలొస్తే వారంతా మాజీలుగా మిగిలిపోతారు. కిరణ్ పోకడ చూస్తే కట్టె విరగదు, పాము చావదు అన్నట్లుగా ఉంది. ప్రజలు మాత్రం బాధల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యుత్ బంద్, రవాణా బంద్, విద్యాలయాలు బంద్, జన జీవనమే బంద్! ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తున్నట్లుగా ఎవరూ భావించడం లేదు. ఇది అప్రకటిత రాష్ట్రపతి పాలనగా లెక్కిస్తున్నారు. శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతా మన్న భయం! ఆమోదించకుండా ఎన్నాళ్లని చట్టాన్ని దాటవేస్తారు? మంత్రి వర్గంలో లుకలుకలు, డా॥శంకర్రావు సాక్షాత్తూ సీఎం మీదనే కేంద్రానికి ఫిర్యాదు. తన మంత్రివర్గంలోని సభ్యుల అవినీతిని గురించి ఫిర్యాదు. మంత్రివర్గం సెక్రటేరియట్ నుంచి పనిచేయడం లేదు. తెలంగాణ అంతటా పాలన స్తంభించింది. తెలంగాణ వాదులు ఆఫీసులకు తాళాలు బిగిస్తే అడ్డుకొనే నాథుడే లేడు. ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా సీఎం దిగిపోయి ఉండేవాడు. మరి మన సీఎం గట్టిగా కుర్చీని కరుచుకొని కూర్చున్నాడు. చరిత్ర తిరగ రాయడమంటే ఇదే కాబోలు! కాంగ్రెస్ తరఫున గెలిచి, కాంగ్రెస్‌ను విమర్శించడం వల్ల ఎదురవుతున్న అపవాదు పడలేక 26 మంది జగన్ అభిమానులైన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఆమోదింపజేసే ధైర్యం లేదు. ఎన్నాళ్లని దీనిని నాన్చుతారు! ఈ పరిస్థితుల్లో శాసనసభ సమావేశాలు ఎలా జరుగుతాయి! ఈ సంక్షోభం ఎన్నాళ్లని కొనసాగాలి? జగన్ భయంతో ఎన్నాళ్లని పారిపోతారు? రాష్ట్రాన్ని విభజించినా, విభజించకపోయినా, ఎన్నికలు జరిపి ప్రజల ‘తీర్పు’ పొందడం ప్రజాస్వామికమని అనిపించుకుంటుంది.

No comments:

Post a Comment

Advertisements

Advertisements